Saturday, August 30, 2014

journalist diary

జర్నలిస్ట్ డైరీ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. నా డైరీ లో మాత్రం ఎప్పుడూ తోలి పేజీ లో ఈ మాటలే ఉండేవి. ఇప్పటికీ ఇవే ఉంటాయి. ఎందుకంటే  ... అసాధ్యాలు కలలకే పరిమితం కదా. 

జైళ్లలో నేరస్తులు ఉండని రోజు కోసం 
ఆస్పత్రులలో రోగులు ఉండని రోజు కోసం 
రోడ్లపై ప్రమాదాలు ఉండని రోజు కోసం.... నేను ప్రార్థిస్తున్నాను 
ఎక్కడా పోలీసులు, సైనికులు కనిపించని రోజు కోసం... 
ఆయుధాగారాల్లో తుపాకులు కనిపించని రోజు కోసం 
అడవుల్లో వేటగాళ్ళు కనిపించని రోజు కోసం 
చివరికి... 
వార్తా పత్రికల్లో వార్తలు కనిపించని రోజు కోసం 
నేను  ప్రార్థిస్తున్నాను ... 

విశ్వ శాంతిని, సౌఖ్యాన్ని ఆకాంక్షిస్తూ ఓ ఇంగ్లీష్ కవి ఊహల్లో ఊపిరి పోసుకున్న పాట ఇది. 
ఎక్కడ సేకరించానో తెలియదు. రెండు పదుల వయసులో ...  జర్నలిస్టుగా నా తోలి డైరీలో రాసుకున్న ఈ కవిత తాలూకు కవి ఎవరో నాకు తెలియదు. కానీ ఈ మాటలు నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి . ఆనాటి ఆ డైరీ రాతే  ... ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది. 

ఇప్పటికి నాకు అర్థం కానిది ఒకటే... నేనెలా జర్నలిస్ట్ ని అయ్యానో... ఈ మహానగరంలో ఎలా బతుకుతున్నానో ... అన్నదే 


Saturday, September 1, 2012

అంతా పేరు మహిమ

అంతా పేరు మహిమ!
కాదా మరి... అసలే అందమైన పేరు. పైగా  పెద్ద  పెద్ద articles  కింద 16 పాయింట్స్ బోల్డ్ ఇటాలిక్స్ లో ఇంకెంత అందంగా కన్పిస్తుందో చెప్పాలా? ఈ పేరు నాకు మా టీచర్ పెట్టారు. ఐదో తరగతి లో బడిలో చేరుతూనే నాకు పద్మశ్రీ వచ్చేసిందన్న మాట.
దానికి తగ్గట్లే అభిమానులు... అభినందనలు. ఉత్తరాలే... ఉత్తరాలు. నేల  మీద నడిస్తే ఒట్టు. (అప్పుడో టీవీఎస్ champ ఉండేది లెండి.) :-)))
ఆంధ్ర భూమి లో చేసేదాన్ని అక్షరం, ఆమె, కుర్రకారు... అన్ని పేజీ ల్లోనూ మనమే.
స్కూల్ నుంచి వస్తూనే టీచర్ వేషం తీసేసి కుర్త పైజామా ల్లోకి మారిపోవడం... రిపోర్టింగ్ కి పరుగులు తీయడం.. వచ్చి చక్కగా రాసి... పది రూపాయలు ఇచ్చి మరీ ఆ కవర్ని బస్సు డ్రైవర్ కి ఇవ్వడం. లేట్ eighties సంగతండి ఇది.  మర్నాడు అచ్చులో ఆ వార్త చూసుకుని ఆనందించడం...
అప్పుడప్పుడు Hyd వచ్చి డెస్క్ కి వెళ్తే వాళ్ళు కబుర్లు చెప్తూ కూర్చో బెట్టుకుని దిద్దమని కాపీలిచ్చేవారు.
అజీజ్ గారు, లక్ష్మి గారు, ప్రసన్న గుర్తున్నారు. చాలా encourage చేసేవారు. ఆ తర్వాత సుగమ్ బాబు గారు, ప్రసేన్ గారు...
ఆ ఉత్సాహం తో తిరిగి వెళ్లి  మరీ రెచ్చిపోయి రాసేసే దాన్ని. లెక్క లేనన్ని byline వార్తలు వచ్చేవి.
అప్పుడు నా కార్య రంగం నిజామాబాదు జిల్లా. అక్కడ మనం సృష్టించిన కలకలం.. మరో సారి చెప్తా ...


Monday, August 27, 2012

నేనెలా జర్నలిస్టునయ్యాను ?

నేనెలా జర్నలిస్టునయ్యాను ?
అవును... నేనెలా జర్నలిస్ట్ నయ్యానో ఆలోచిస్తే ఇప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. నిజానికి నాకు అప్పటివరకు journalism అనే profession ఒకటి ఉంటుందని తెలియదు. టీచర్ నో, డాక్టర్ నో అవ్వాలనుకునేదాన్ని. అలాంటిది ఇంకా చదువు పూర్తి కాక ముందే ఈ వృత్తి తో పరిచయమయింది. టీచర్గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటు గా డిగ్రీ చదువు కుంటున్నరోజులవి. మా బాబాయి ఒకరు చిన్న పత్రిక మొదలెట్టారు. దాని పేరు జాతి రత్నం. ఆ పేరుతో ఒక కాలం స్టార్ట్ చేసి గాంధీ, నెహ్రు తదితర జాతి రత్నాల గురించి రాసేవారు. ఓ సారి కింద నా పేరు పెట్టి తెచ్చి చూపించారు. అచ్చు లో మన పేరు ఎంత అందంగా కన్పిస్తుందో మీడియా మిత్రులకి చెప్పనక్కర లేదు కదా. నేను అలాగే పడిపోయాను. ఆ పడడం ఏకంగా జీవిత కాలం  పాటు లేవనీయకుండా చేస్తుందని అసలే మాత్రం ఊహించలేదు సుమా.  ఢిల్లీ లోని హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ journalism నుంచి డిప్లొమా  చేశాను. ఆంధ్రభూమి కి అప్లై చేస్తే వార్తలు పంపమని లెటర్ వచ్చింది. ఆ ఉత్తరం రాసి పుణ్యం కట్టు కున్నది ఆర్వీ రామారావు గారు. అక్కడ రెసిడెంట్ ఎడిటర్ గ ఉండేవారు.  అలా ఓ  మూడేళ్లపాటు అరవ చాకిరీ... అటు టీచర్ ఉద్యోగం... ఇటు వార్తల సేకరణ. మరో పక్క చదువు. యూజీ, పీజీ అయిపోయాయి. journalism తాలూకు కిక్ మాత్రం తగ్గలా. అసలు విషయం చెప్పనా ? మూడేళ్ళు పని చేస్తే సదరు పత్రిక నుంచి నాకు ఒక్క రూపాయి రాలేదంటే నమ్ముతారా? డెస్క్, ఎడిటర్, MD... అందరిని కలిసాను. నో use.  అయినా ఎందుకు పని చేశానంటే... చెప్పానుగా... కిక్!
ఆ కిక్ ఇచ్చిన వార్తలేమిటో..  అందుకు నాకు సహకరించిన దెవరో మళ్ళీ చెప్తా.